మా అత్తమ్మ
హల్లో!
ఈ రోజు మీకు నేను మా అత్తమ్మ గురించి చెప్పబోతున్నాను.
నేను చెప్పబోయే విషయం చాలా బాధాకరమైనది.
నేను మా అత్తమ్మను అత్త అని ఏనాడు అనుకోలేదు.
అమ్మ వలె తను ప్రేమను పంచేది. తాను నాకు గురువుగా పాఠాలు చెప్పేది.తను స్నేహితురాలిగా సలహాలు ఇచ్చేది.
అలా జరుగుతుండగా ,ఒకనాడు మా అత్తమ్మకు పెళ్ళిసంబంధాలు వచ్చాయి.
ఒక పెళ్ళి సంబంధం కుదిరి, మా అత్తమ్మ పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది.
మరవళికి మా అత్తమ్మతో నేను వెళ్ళాను.
నేణు వెళ్ళిన రోజు , అంతా మా అత్తమ్మను బాగానే చూశారు.
పెళ్ళి అయిన మూడు నెలల నుండి అంతా తారుమారయ్యింది.
చీటికీ మాటికీ తిడుతూ ఉండేవారు.వాళ్ళలో మొదటివ్యక్తి అమ్మన్నమ్మ.
ఈమె మా అత్తమ్మ వాళ్ళ భర్త అక్క.ఈమె ఇంటిలోనే మా అత్తమ్మ కాపురం ఉండేది.
మా అత్తమ్మ మామయ్య సంతోషంగా ఉండడం చూడలేక,
మా అత్తమ్మ కాపురాన్ని వాళ్ళ ఇంటికి అవతల వైపుగా ఉన్న, తెల్ల రంగా ఇంటి పైభాగాన ఉన్న మూడవ అంతస్తులోకి జేరిపించింది.
మా అత్తమ్మ పెళ్ళి అయిన తరువాత ఏనాడు సంతోషంగా లేనే లేదు.
మేము వెళ్ళిన ప్రతిసారీ ఏడుస్తూనే ఉండేది.
అడిగితే చెప్పేదే కాదు.
ఇలా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ,తన మనస్సులో తను బాధ పడేదే కానీ ,మాకు చెప్పేదే కాదు.
ఇలా కొంత కాలం గడిచాక, మేము అప్పుడప్పుడు వెళుతున్నామని వాళ్ళ కాపురాన్ని కావలికి మార్చారు.
కావలిలో సివయ్య అని ఒకాయన ఇంటిలో కాపురం ఉండే వాళ్ళు.
నన్ను మన్నించండి.
ఎందుకంటే ,నేను మీకు ఒక విషయం చెప్పడం మరిచాను.
అదేమిటంటే, మా అత్తమ్మకు గర్భం వచ్చినప్పటి సంగతి.
ఏ ఆడపిల్లకైనా గర్భం వస్తే పుట్టింటికి రావడం ఆనవాయితీ.
అలాగే మా అత్తమ్మ కూడా మా ఇంటికి వచ్చింది.
కొద్ది రోజూ బాగానే ఉన్నింది.
హఠాత్తుగా ఒకరోజు నొప్పులు వచ్చేసరికి వైద్యశాలకు తీసుకెళ్ళము.
నొప్పులు తగ్గి ఒక అబ్బాయి పుట్టాడు.
ఆ అబ్బాయిని చూడడానికి మామయ్యను రమ్మంటే ,ఎలాగో వచ్చాడు.
వచ్చి చూసి వెళ్ళి పోయాడు.
తరువాత వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబం అంతా చూసారు.
ఇక, వైద్యశాల నుంచి ఇంటికి తీసుకు వచ్చాం.
కొద్ది రోజుల తరువాత ,ఫోన్ చేసి వాళ్ళు మా అత్తమ్మను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు.
మా అమ్మానాన్నా ఎంత చెప్పినా వినలేదు.
'నేను వెళ్ళాలి” అనింది.
సరే అని మా అత్తమ్మకు తోడుగా మా నాన్నమ్మను పంపించాం.
కావలి వెళ్లిన తరువాత వాళ్ళు," మా ఇంటికి ఇప్పుడు ఎందుకు వచ్చావు ?" అని అడిగారు.
వెళ్లి కొద్ది రోజుల తరువాత రమ్మన్నారు.
మళ్ళీ ఇంటికి ఇంటికి తిరిగి వచ్చేసి ,కొద్ది రోజుల తరువాత వెళ్ళింది.
అప్పుడు మా అత్తమ్మకు పుట్టిన బాబును జొన్నవాడకు వాళ్ళ అక్కవాళ్ళు తీసుకు వెళుతారు 'అని చెప్పి బాబుని ఇవ్వమన్నాడు.
మా అత్తమ్మ వస్తానంటే వద్దన్నాడు.
బలవంతంగా తల్లినీ బిడ్డనూ వేరు చేసాడు.
కొద్దిసేపటి తరువాత , మా అత్తమ్మ ఫోన్ చేసి , అక్కడ జరిగిన సంగతి చెప్పింది.
మా అత్తమ్మ కు సర్ది చెప్పారు.
ఆ మరుసటి రోజు వాళ్ళు ఫోన్ చేసి ," మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తుంది "అని చెప్పారు.
మా వాళ్ళు అందరూ అలిసి ,ఒక్కొక్కరూ ఒక్కో దగ్గరకు వెళ్ళి ,ఎంత వెతికినా కనబడలేదు.
మరుసటినాడు, ఈనాడు పేపర్లో రాపూరు రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఒక శవం అని చదివి ,అది మా అత్తమ్మలాగా ఉండడం గమనించి ,కావలి రైల్వే స్టేషన్ కు వెళ్ళి చూడగా ,అది అత్తమ్మదని తెలిసింది.
ఆ రోజు మా వాళ్ళు వెళ్ళే సమయంలో ,మా మామయ్య వాళ్ళు ఆ శవాన్ని అనాధ శవం అని రాపిస్తుండగా ,
మా వాళ్ళు వెళ్ళి ,"అది మా అమ్మాయి " అని రాయించారు.
నేను మొట్టమొదట ఎక్కువగా బాధపడిన సంఘటన ఇది.
ఇది కథ కాదు నిజం.
నేను ఎంత ఎక్కువగా బాధ పడ్డానో నాకు తప్ప ఇంక మరెవ్వరికీ తెలియదు.
*
డి గురు ప్రసన్న , 8 వ తరగతి.
నెల్లూరు.
9-11-2008
Prabhava,Books and Beyond ! * All rights reserved.