*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Saturday, February 26, 2011

"బురుగూ బురుగూ! చూశావా..మరేమో ..!

"బురుగూ బురుగూ...! చూశావా..మరేమో .. ఇదుగో ..ఈ బుజ్జి కథ మాకిచ్చేసి "నేను లేనూ- ఇపుడిపుడే రానూ -వెళ్ళిపోయానూ ...  మళ్ళీ రాను అని చెప్పేసి.. ..ఆ పెద్దాయన ఎలాగా వెళ్ళి పోయాడో!
 నీగ్గాని కనడ్డాడేమిటీ ? "
***

రాచ్చసుడూ ..పదమూడో ఎక్కం...  ఖద...
 "బురుగూ బురుగూ! చూశావా..మరేమో నేనూ వాల్ల సీతా ఆలుకుంటేనేమో ..మరేమో వాల్ల బెద్దన్నయ్య వచ్చి దాన్ని లాకెళ్ళిపోయి...నన్ను ఫో అనీ.."
"ఏడవుకురా గోపీ...నేను రేపో ఫది రోలకో ఇలా బేద్దవాణ్ణయిపోతాగా ..అపుడు వాడి నడ్డి మీద ఛంపేద్దాం .. ఏ?"


"కాదూ..ఇపుడే బెద్దవాడివయిపో..కొఠేదాం"
"ఒద్దమ్మా..నేను బెద్దవాణ్ణయ్యే లోగా నీకో ఖద చెప్పనా?- అనగనగనగనగనగనగనగన.."
"గనగన వద్దూ ఖద చెప్పు "
"సరి సరి...అనగనగా ఓ రాజు ..ఆ రాజు కేమో చాఖ్ఖని కొడుకు ..నీలాగా అరుస్తూ య్యెంథో ముద్దొస్తాడు..
చక్కా గిరిజాల జుట్టుతో ..పేద్ద ఖత్తి పట్టుకొని..అంటే ఖత్తి  జుట్టుతో కాదు ..చేత్తో పట్టుకొని ..స్సిమ్మాల్ని ..పులున్నీ .. య్యేనుగుల్నీ ఛంపేసేవాడు.
ఆ రాజు గారింటి ఎదురుగుండా ఇంకో కృష్ణం రాజు గారుండే వారు.
ఆయనకి ఓ కూతురు ..ఇంచక్కా గానపెసూనాంబంత బాంటుంది.

వాళ్ళద్దరూ రోజూ ఇంచక్కా ఆలుకునే వారు .వాళ్ళమ్మ బెల్లపుజీళ్ళూ చెగోడీలు మనమరాలూ బోల్డు పెట్టేది..రాజు గారింటో బేద్దగది నిండా జీళ్ళూ ..ఇంకో గది నిండా జాంగిరీలు వుంటాయి గదా..
"ముంజెల బండీలు ?మూడు చెక్కరాల సయికిళ్ళూ ? 


"ఓ..అవి కూడా .ఫదో యాబయో వుంటాయి .ఇంకా తాటకుబొమ్మలూ  రిబ్బన్లూ ..కాజాలు...అయిసుక్రీము ..బటానీలు ...గోపిగాళ్ళు.."


"ఖద చె..."
"సర్లే సర్లే .. ఆ రోజున యువరాణీ యువరాజూ ఆడుకుంటూ ఉండగా ఏమైయిందంటే ..
దాగుడు మూతలాటలో యువరాజు కళ్ళు మూసుకొని ఉండగా - ఓ బేద్ద రాచ్చసుడు ఇలా వచ్చేశాడు .
వచ్చేసి యువరాణిని ఎత్తుకు పారిపోయాడు ..వాడి కోటలో దాచేశాడు - 
యువరాజు కళ్ళు తెరిచే సరికి రాణి ఎదీ?
లేదు! 
"యమ్మే "అని ఏడుద్దామని అనుకొనే లోగా 


ఓ పెదరాసిపెద్దమ్మ వచ్చి "ఎందుకు ఏడుద్దామనుకుంటున్నవు అబ్బాయీ?" అని అడిగింది -
వాడు చెప్పాడు.
"మీ సీత నాకు తెలుసూ ..రాఛ్ఛసుడి కోటలో ఏడుస్తుందీ " అంది పెద్దమ్మ.
"మరి యలగా?" అని ఏడ్చేశాడు రాజు.
బయ పడకు -నేను నీకు కీలు గుర్రం ఇస్తాను -అందుమీద వెళ్ళి రాఛ్ఛసుణ్ణి ఛంపేసి సీతని తెచ్చుకో ..హ్రీం హ్రీం హ్రోం ..” అంది పెద్దమ్మ.
అపుడేమో యువరజు ఆ కీలుగుర్రం ఎక్కి "జై కీలు గుర్రం -రాఛ్ఛ్సుడి ఇంటికి పద" అనే సరికి అనేసరికి అదెమో ఇలా జూం మని ఎగీరిపోయింది.
రాఛ్ఛసుడి ఇంటి దగ్గిర వీదిలో ఇంకో బేద్ద రాఛ్ఛ్సుడునాడు.


"ఒరే యువరాజు -నీకు మరి సీ రామూ దై చేతని పజ్జెం వచ్చురా?"
"రాదు"


"అయితే పో వెదవా .పోయి చదువుకో "
"యువరాజు ఇంటికెళ్ళి వళ్ళమ్మనడిగి ఆ పజ్జం ఘబుక్కుక నేర్చేసుకొని పరిగేఠు కొచ్చి రాఛ్ఛసుడికి అప్పచెప్పాడు .వాడు సరే అని లోపలికి వదిలాడు.


లోపల ఇంకో రాఛ్ఛసుడున్నాడు .

"వురేయ్ ..నీకు సిబి చక్కరవర్తి పాటం వొచ్చిందిరా?ఆర్యులనగా నెవరు?
"అది మా బాబాయి బళ్ళో పాటం .నాకు తెలియదు."


" మీకూ వుంది .చదూకో ఫో "
"యువరాజు పర్గేఠూకొచ్చి సిబి పాటం ఆర్రుల పాటం ..చదివేసి వళ్ళీ వచ్చేసి అప్పచెప్పేశాడు .చివరస్తు గా విప్లవం కవి వాడిది ఓ పజ్జం చదివే సరికి వాడు బయపడీ పోయాడు .యువరాజు వాడి మీంచి ఇలా నడిచి లోపలికెళ్ళాడు .
లోపల ఇంకో పేద్ద రాఛ్ఛసుడున్నాడు .వాడు సీతకి ప్రెవేటు చెప్పేస్తున్నాడు .
"ఓరీ రాఛ్ఛసా .. మా సీతని వదిలెయ్యి ..లాపోతే ఈ ఖత్తితో నీ నడ్డి మీద ఛంపేస్తా.."
అపుఢా రాఛ్ఛసుడు ఓటుకి వచ్చిన మంత్రిలా ఇలా గాఠిగా నవ్వేశాడు .


"వురేయ్ .నీకు పదమూడో ఎక్కం వచ్చురా ?"
"నాకు రాదే !.. మా బాబాయిక్కూడా రాదని నా అవమానం !"
"నాకూ లాదు "


"అయితే ఫో సీతను ఇవ్వను ఫో "

అపుడు యువరాజు పరుగేఠుకెళ్ళి వీదులో లోని వాళ్ళ బాబాయి నడిగాడు.
"ఎక్కంలేదు పిక్కం లేదు .బిజీగా ఉన్నా ..ఫో"
లావుపాటి పక్కింటి పిన్ని గారి ముగుడూ పకోడీల నారాయణా .. పేదరాసిపెద్దామ్మా ,ఆఖరికి వాళ్ళమ్మక్కూడా తెలీదుట ! చివరికి వాళ్ళ నాన్న ఎక్కాల బుక్కు తీసి గబగబ చెప్పేశాడు  .
వెంటనే ఖంటతా పట్టేసి రాఛ్ఛసుడి దగ్గరికెళి ఇలా నుంచుని - పదమూదోకట్ల పదమూడు- పదమూడుపదుల నూటముఫై ..అని గడగడా వప్పజెప్పెశాడు.
అపుడు రాఛ్ఛసుడు హా అని అరిచి కింద హాచ్చెర్యపడిపోయేశాడు.రాజు సీతని రష్యించాడు .
జై!"
"అయితే బురుగూ..నాకు అర్జంటుగా పదమూడో ఎక్కం నేర్పేయ్ - నే వెళ్ళి ..సీతని రష్యిస్తాను. "
"అలా నేరవ కూడదమ్మా గోపీ .. మీ ఇంతికెళ్ళి ఎక్కాల బుక్కు తీసుకురా ..అది చూసి , మంత్రం వేసి చెప్పాలి- ఎక్కాల బుక్కు చూసి చెప్పక పోతే దేవుడికి కోపం వస్తుంది"
"తెత్తా వుండు "
" వురేయ్ ఈ ఖద చదివేవాడూ..ఈ ఖద చదివేవాడూ! ఆ గోపిగాడొస్తే నేను లేనూ- ఇపుడిపుడే రానూ -తెలుగు సినిమాకి వెళ్ళిపోయానూ అని చెప్పరా- ఎం?"
***అయిపోయింది***

****అయిపోయిందంటూ  మనకి దూరంగా పరుగులు పెట్టేసిన ఆ పెద్దాయనకు 
ఏమని వీడ్కోలు చెప్తాం?
 బుడుగు ని ఇలా మనకు అప్పజెప్పేసి .. తాను తప్పుకున్న పెద్దాయనకు!
ప్పటికీ అయిపోని  ఈ బురుగు ఖదలకు, ఆ కథకుడి కలం పోషణకి......జై!
 ఆ పసితనపు పచ్చదనం పదికాలాలు పదిలం.పదిలం.
ముళ్ళపూడివారికి  జేజేలు పలుకుతూ..  అదేంటో, ఆయనను వంటరిగా సాగనంపడం ఇష్టం లేక కాబోలు
అంకుల్ పాయ్ తోడెళ్ళారు.
సజల నయయాలతో ..సగౌరవంగా వీడ్కోలు.వారిరువురికీ.
కలమూ కాలమూ ఎన్నటికీ ఆగిపోయేవీ ఆరిపోయేవీ కావుగా !
అయిపోయేది  కాదు. చంద్ర లత****; 

రచన :  శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు,
బొమ్మలు: ఎప్పటిలాగానే, మన  బాపు గారు.
*

Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: