*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, August 20, 2010

రామయ్య నాగలి

బాలోత్సవ్ -2009, కొత్తగూడెం ,కథారచన లో సీనియర్లలో ప్రథమ బహుమతి పొందిన కథ. 
*

అనగా అనగా ఒక ఊరు.
ఊరి పేరు అమరావతి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నది. అమరావతిని ఆనుకొని చిన్న గ్రామం ఉన్నది. అది రంగయ్య పాలెం.
ఊరును ఆనుకొని గలగలా కృష్ణమ్మ  పరుగులు వేస్తుంది.
  ఊర్లో అన్నీ పనులకు పెద్దదిక్కు కృష్ణమ్మే,పిండ ప్రదానానికైనా ,మంచి నీటికైనా ,పొలం పనులకైనా,పడవ కట్టాలన్నా,పూట గడవాలన్నా ఊరికి కృష్ణమ్మే ఆధారం.
పొద్దున్నే కోడికూతతో మొదలవుతుంది ప్రయాణం ,కోయిల కుహూ కుహూ రాగాలతో ,తుమ్మెదల ఝుం ఝుం రాగాలతో ,ఉడుతుల ఊగిసలాటతో  ,పిలగాల్ల గోలతో ,పెద్దాళ్ళ పందాలతో ..ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందా ఊరు.
ఊరి  మధ్యలో ఉంది గ్రామ దేవత పోలేరమ్మ. గద్దె దగ్గర దసరా తొమ్మిది రోజులూ జాతరే. చుట్టు పక్కల ప్రాంతాల వారంతా అక్కడికి రావలసిందే.అదీ అక్కడి ఆచారం.
జాతరకు కావాల్సిన రంగుల రాట్నం,చెక్క బొమ్మలు ,దేవుళ్ల  ప్రతిమలు ,భోజనానికి బల్లలూ ,కుర్చీలు ,ఉట కొట్టే కొమ్మలు ..ఒక్కటేమిటి అన్నింటికీ రామయ్యే దిక్కు.
" అన్నట్లు రామయ్య దశరా ఇంకా నెల రోజులే ఉంది. సామాన్లు ఇంకాస్త నాణ్యంగా చేయి,పాలీషు కోసం మొహమాటం పడకు .సర్పంచుని నేను చెప్తున్నా" ఆంజనేయులు ఆరాటం.
"అట్టాగే అయ్యగారు" రంగయ్య ఓదార్పు.
ఇదీ సంగతి.రామయ్యకు ముగ్గురు కూతుళ్ళు,ఇద్దరు కొడుకులు,భార్య.కొడుకులిద్దరికీ కర్ర కోయడం ,మొద్దు కొనడం ,అమ్మడం లాంటి చిన్నపాటి పనులు చేస్తూ రామయ్యకు చేదోడు వాదోడుగా ఉంటారు.
ఇంటిల్లిపాదికీ రామయ్య ఒక్క రెక్క సంపాదనే దిక్కు.అయినా ఇంట్లో లోటూ ఉండదు. ఎందుకంటే రామయ్య చేతి మహిమ అలాంటిది.
దసరా ఉత్సవాలు ముగిసాయి.రామయ్య కూ గిట్టుబాటు దిట్టంగానే ముట్టింది.ఆంజనేయులు గారు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ మీసాలు మెలేస్తున్నారు.కాదు మరీ అంతా ఆయన చలవే  గదా!
రోజులు ఒక్కలా ఉండవు.
తొలకరి  వచ్చే వేళయ్యింది.కానీ ,మేఘుడు కరుణించ లేదు.
వారాలు నెలలు పక్షాలు గడుస్తున్నాయి.అయినా దేవత కరుణించ లేదు.
వర్షం కోసం కోళ్ళను బలులిస్తున్నారు .అయినా పోలేరమ్మ కనికరించలేదు.
రైతన్న విత్తనం వేయడానికి జంకుతున్నారు.
రోజు రోజుకీ పరిస్తితి దిగజారుతోంది.భూములు బీటలు వారుతున్నాయి.ఎద్దుల డొక్కలు మాడి పోతున్నాయి.
  చుక్క నీరు లేదు.కృష్ణమ్మ మొఖం చాటేసింది.చుక్క నీరు లేదు పొమ్మంది.
సంక్రాంతి లోపు పిల్లాపాపలతో మనుమలు మనవరాళ్ళ అల్లరితో ,అల్లుళ్ళతో చిరు గొడవలు ,కోడళ్ళ కోరికలు,అరిశల రుచులతో నిండుగా ఉండాల్సిన ఇల్లు బోసిపోయింది.
రామయ్య ఆరోగ్యం క్షీణించింది.
మనిషి బక్కగా పాలి పోయాడు.చేయి ఉలిని పట్టనంది.మనస్సు పని మీద లగ్నం కావడం లేదు. కరువు ధాటికి ప్రక్క ఊర్లో ఉంటున్న అల్లుళ్ళు పొలం దున్నలేమంటూ రామయ్య ఇంట్లో మకాం వేసారు.
తనకే దిక్కు లేదు మరి బంధువులో !
భార్య బంగారం తాకట్టు పెట్టింది.కన్న కొడుకులు కూలి పని చేస్తున్నారు. వొచ్చిన సొమ్మంతా మందులకే.
సర్కారోళ్ళు చేతి వృత్తుల్ని ఆదుకొంటామని చెప్పి రోజులు గడిచాయి.కానీ, ఆచరణలో అడుగే ముందుకు పడలేదు.పూట గడవడమే కష్టంగా ఉన్నది.
ఆరోజు రాత్రి వర్షం కురిసింది.రామయ్యకళ్ళు ఆనందంతో మెరిసాయి.రేపట్నుంచి రైతులు వస్తారు.నాగళ్ళు చేయాలి.గొర్రులు చేయాలి.కొడవళ్ళు పిడులు పట్టాలి.కొయ్యల్ని తీసుకు రావాలి.ఇక తిండికి లోటుండదు.
కానీ  విధి వక్రించింది. రామయ్య రాత్రి వేళలో బాగా దగ్గు తున్నాడు. కొడుకులు ఎడ్ల బండి మీద బొంత కప్పి ,ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని , ఆసుపత్రికి తీసుక పోతున్నారు.
అసలే సత్తువ లేని ఎడ్లు కూలబడ్డాయి.ఇక తాము మోయలేమని చేతులెత్తేసాయి.
రామయ్యను తమ భుజాలపై ఎత్తుకెళుతున్నారు అతని కొడుకులు .
దవాఖానా చెరారు.కానీ డాక్టరు నిద్ర పోతున్నాడు.అతను నైట్ డ్యూటీలోనే ఉన్నాడు కానీ పిలిచినా పలకడు.ఎట్టకేలకు నిద్ర లేచినాడు,కానీ పెద్దవాళ్ళు చూడకుండా లంచం ఇవ్వమన్నాడు. పది కాదు ఇరవై కాదు .అయిదు వందలు .అవికాక మందులకు వేరే ఖర్చు. డబ్బు కట్టలేదు.
పువ్వు రాలి పోయింది. ఇన్నాళ్ళు ఊరికి చెదోడు వాదోడు గా ఉన్న నాగలి రామయ్య తుది  శ్వాస విడిచాడు.చుట్టూ ఉన్న ఊరి  వాళ్ళు కానీ ,సర్కారు కానీ ఆపలేక పోయింది నిండు మనిషి ప్రాణాలను.
కృష్ణమ్మ గలగలా పారుతోంది తనకేమీ సంబంధం లేనట్టు.
ఒడ్డుపై రామయ్య చితిని పెట్టారు.పెద్దకొడుకు అయ్యగారు చెప్పినట్లే కర్మ కాండ జరిపించాడు.రామయ్య అంతిమ యాత్రకు ఊరంతా వచ్చింది.
సర్పంచి ఆంజనేయులు కంట తడి పెట్టాడు.తను మాత్రం ఏం చేయ గలడు?
రామయ్య పోయింతరువాత,కొడుకులు వారసత్వంగా అదే వృత్తిని స్వీకరించారు.పనిలేక, తిండి లేక, ఆరోగ్యం సహకరించక ,సర్కారు ఆదుకొనక తండ్రి మరణించాడు.
ఉన్న కొద్ది భూమినీ ప్రైవేట్ కంపనీలు దగా చేసి ,ప్లాస్టిక్ వస్తువులొచ్చి కొండపల్లి బొమ్మల్ను పొమ్మనిట్రాక్టర్లు నాగళ్ళను చీకొట్టి ,సర్కారు ఎలక్షన్ల తరువాత మొహం చాటేసి ..పీకల్లోతు కష్టాల్లో ..బ్రతుకు భారం మోస్తున్నారు.
మోస్తూనే ఉన్నారు!
***
వి.రవికాంత్ శర్మ ,
10 తరగతి,సింగరేణి పాఠశాల, ఇల్లందు.
14-11-2009

*
చిత్రం: కృష్ణ  వంశి , గ్రీష్మ ప్రభవ -2010, నెల్లూరు.

Prabhava,Books and Beyond ! * All rights reserved.

2 comments:

rambabu said...

ramayya naagali katha baagundi. baaludi saamaajika dristiki, madilo aardrathaku addam patindi. oohaa sakthi kaligina Ravikaanth manchi rachayitha kaavadaaniki avakasaalu mendu gaa unnayi. congrats to Ravikanth!
-P.Rambabu, Velairpad, Khammam dist

Anonymous said...

ఈ అబ్బాయికి చాల భవిష్యత్తు ఉంది. ఎంత బాగా రాసాడో. మొదటి బహుమతి వచ్చిందంటే అందులో ఆశ్చర్యం ఏమి లేదు. చిట్టి తండ్రి నీ బుర్రలో ఎన్ని విషయాలు నా ఆశీర్వాదాలు అందరి ఆశీర్వాదాలు తీసుకో నాయనా