*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label New Books. Show all posts
Showing posts with label New Books. Show all posts

Sunday, September 18, 2016

వాళ్ళు... వీళ్ళు.. పారిజాతాలు.

"మానవజీవితం మనిషి శ్రద్ధగా మలుచుకున్న నవల లాంటిది కాదూ? " అని అంటారు ,జోస్ ఒర్తేగా గాసెట్,
ఒకానొక సందర్భంలో !

నవల కు జీవితానికి ఉన్న ఆ అవినాభావ సంబంధం అనిర్వచనీయమైనదీ. అపురూపమైనదీ.
మానవ జీవితంలోని సున్నితపార్శ్వాన్ని ,మరింత సున్నితంగా సునిశితంగా చంద్రలత అక్షరబద్దం చేసే క్రమంలో పరిమళించినవే ఈ "వాళ్ళు... వీళ్ళు.. పారిజాతాలు."
 ఈ శనివారం, 24 వ తేదీన , పుస్తకరూపంలో  ఈ నవలను ప్రభవ మీకు అందించబోతున్నది.

స్థలం :    ఫ్రభవ.పొగతోట, నెల్లూరు
సమయం : 24 సెప్టెంబరు, సాయంకాలం ,6 గంటలనుండి.
నవల ఆవిష్కరణ : శ్రీ Ch.సంజీవ రావు గారు
నవల కబుర్లు చెప్పేవారు,:  ఆర్. ఎం. ఉమా మహేశ్వర రావు గారు,కాట్రగడ్డ దయానంద్ గారు,   వి.ప్రతిమ గారు ,విష్ణు ప్రియ గారు.
, మరికొందరు.
మీ వంతు మీరు మీ దోసిళ్ళనిండా
పారిజాతాలు  నింపుకు పోదురు ,
వచ్చేయండి మరి.


మరిన్ని వివరాలకు :
శ్రీ ఈతకోట సుబ్బారావు గారు ,9440529785
ఫ్రభవ :(0861) 2333767 /2337375 prabhavabadi@gmail.com

***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, June 6, 2014

మానుమల్లి కమ్మదనం

"మన భూమి మల్లాంలో గుండ్రంగా ,జల్లల దొరువులో చదరంగా 
ఉంటాది." అంటారట  ప్రళయ కావేరి వొడ్డున పెరిగే గడుగ్గాయిలు ! 
 ఇలాంటి చెణుకులుఎన్నో స వెం రమేశ్ గారి కలం విదిలింపుల్లో!
 తిట్లు చెట్లు వ్యవసాయ పనిముట్లు,,వానకోయిల మద్యపానం , చీమక్క దోమక్క కాకమ్మ గువ్వమ్మ .. మూలికలు మూలవైద్యాలు , డా.అగరం వసంత్ గారి రాతల కోతలు.. జీవన వెతలు ...జీవిత కతలు .. "తెల్ల కొక్కెర్ల తెప్పం
"మా ఎత్తీస్తారా? " అన్న ప్రశ్న నుంచి పుట్టిన "కడసీ కోరిక" "ఆ అడవంచు పల్లెలో " "పదహారు పొద్దులు "  అత్తవాన పొంగలి  " పెట్టి "పాటల పెట్టి" రాగాలు తీసే "గూడూ చెదిరిన అవ్వ" కతలు ... ఎర్నూగు పూలు ..విజయ లక్ష్మి గారు ఈ  " ఎర్నూగులు"గా పిలవబడే వెర్రి నూగుల పూల సౌందర్యాన్ని తలపింప జేసే  ఈ భాషా సౌందర్యం , గాసటను పోగొట్టి సేద తీర్చే చల్ల గాలిలా ,
కథలనంతా కమ్ముకొని ఆనందాన్ని కలిగిస్తుంది ఆ అని అంటారు విజయ లక్ష్మి గారు. 

 తెలుగు ,తమిళ, కన్నడ ప్రాంతాలలో మూడు ముక్కలైన తెలుగు బతుకుల వెలుగులు ఒకటే అని గుర్తించ మంటాయి. " మొరుసు నాడు కతలు"
ఇక, "ఇరుల దొడ్డి కతలు  గిరిజనులతో పెనవేసుకొని పోయినవి. నంధ్యాల నారాయణరెడ్డి గారి చమత్కారాలు. జీవితం తో ముడిపడిన  పర్ధాన్ గోండుల జీవిత కతలు. బన్నేరు గట్ట అడవీ ప్రాంతం , గేదర చెట్లు 
, ఆ కొండల బండల మీద చిన్నపాటి చెరువంత దొనలు , పాండవగవులు, మాగడి కెంప రాయడి కోట, కైవారం నారాయణ తాత పాట.. వెరశి " ఇరుల దొడ్డి కతలు" పార్దీవ  శరీరాలను విడిచివచ్చే పాండవగవులు , బౌద్ధం ఆనవాళ్ళు అంటారు విజయ లక్ష్మి గారు. 

ఇక, చెన్న పట్నం చేరి  చెడే వాళ్ళ ను విన్నామే కానీ,
చెడి చెన్న పట్నం చేరిన వారి కతలు తెలుసుకోవాలంటే,  ఇంట్లో తెలుగు వీధిలో తమిళం  మాట్లాడుకొనే  తొండనాడు జీవితాలు, తెలుసుకోవాలంటే   తొండనాడు కతలు."  చదివి తీరాల్సిందే మరి.

ఇందులో , తొండనాడు ప్రాంతపు తమిళ కతల తెలుగు అనువాదాలు కూడా ఉండడం విశేషం .

ఇక ,అన్నిటికీ తలమానికం  " శ్రీ రాయంగల శ్రీ కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజం నాయకర్  గారు, తమిళులు అభిమానం గా పిలుచుకొనే మాండలిక పితమహుడు ,కీరా,   తమిళం లో రచించిన " గోపల్ల గ్రామం" అనువాదం " గోపల్లె . ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అంటారు విజయ లక్ష్మి గారు.
వందలాది సంవత్సరాల క్రితం తమిళ నాట ,రేగడి ప్రాంతానికి చేరుకొన్న తెలుగు వారు ,అక్కడ వారి జీవన పోరాటం గోపల్లె నవల .నంధ్యాల నారాయణ రెడ్డి గారి అనువాదంలో . 
***. 
ఇన్ని పుస్తకాల కతలూ పొరుగు  తెలుగు కతలు పేరిట  ఒక్క చోట అందించిన వారు డా. రాయ దుర్గం విజయ లక్ష్మి గారు. ఇవి చెన్నై ఆకాశవాణి  సాహిత్య కార్యక్రమాలలో ప్రసారం చేయబడిన రేడియో ప్రసంగాలు. నాగసూరి వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమ నిర్దేశకులే కాక, ఈ ప్రసంగాల సంకలనానికి ముందుమాట కూడా రాసారు. 
వారంటారు , ప్రతి సమీక్ష ఎలా ఉండాలంటే ," సంక్షిప్తంగా ,సరళంగా, నిరక్షరాస్యులు అందుకొనేలా , రేడియో ప్రసంగంలా ఉండాలి అని  " ఈ రచనలను చదివితే, "రేడియో కోణంలో సిద్దించే శిల్పం ఏమిటో అవగతమవుతుంది. సవ్యంగా ఒదిగిపోవడంసరిపోదు ,అది వేగంగా కూడా నడవాలి " అంటూ నాగసూరి , ఆ దిశగా విజయ లక్ష్మి  గారి కృషిని వివరించారు ." విజయ లక్ష్మి గారు నిజమైన విద్యార్థిలా శ్రమించారు. నమ్రతగా కృషి చేశారు. సాహిత్యం ,భాష అనే దృష్టి కాకుండా కథల్లో చిత్రించిన జీవితం ఏమిటో చెప్పాలని.  కనుక విషయం ,వివరించవలసిన కోణాలు విశేషంగా ఉంటాయి. ఇందులో ఒక రచయిత కాకుండా పలువురు రాసిన  కథలే ఎక్కువ. "

సుక్క పుట్టే పొద్దు ,కన్ను కొరికే పొద్దు   అంటూ పొద్దు పొడిచే దగ్గర నుంచీ పొద్దుగూకే వరకు సాగే  జీవితాలు ,   వంపులు తిరిగే వంకలకు  పెట్టుకొన్న చక్కటి తెలుగు పేర్లు ,తల్లి వంక , తండ్రి వంక ,అన్నదమ్ముల వంక, అక్కచెల్లెళ్ల వంక ... ఆపై ఇంగ్లీషు పదాలకు తెలుగులో పిలుచుకొనే సృజనాత్మకత.... మిన్నులివు ( రేడియో) ,అల పలుకి (టెలిఫోన్) ,చే పలుకి ( సెల్ ఫోన్)... చదువుతున్న కొద్దీ ,
 తల్లి నుడిపై వారికున్న మమకారంతో వ్యక్త పరుస్తూనే, మనకొక హెచ్చరిక గా నిలబడతాయి ఈ పొరుగు తెలుగు కతలు. 
నిస్సందేహంగా.  
          "గాలి వాన కు పడిపోయినా ,ఒళ్ళంతా చిగురించి తలెత్తుకొని తన ఉనికిని  సగర్వంగా చాటుకొనే మానుమల్లి  పూలవాసనలు మనసంతా ఆక్రమిస్తాయి. "
 మరో సారి .


                                     ప్రతులకు
    చేపలుకి :            
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
స వెం రమేశ్ :  (0) 8500548142   
ఉమా మహేశ్వరరావు 8985425888

***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com

***


Wednesday, May 28, 2014

యట్లెట్లా! అట్లెట్లే !

"సూడండప్పా ఇనుకోండమ్మా. నేను ముంద్రే సెప్పతా ఉండా,
ఎవురు ఏమి ఎబుడు ,ఏడ అని నన్ను అడగొద్దండ,నడిసిండేది రాస్తా ఉండా ,
సదివితే సదవండా ఇంటే ఇనండా ,
నన్నేమన్నా అంటిరో ,నేను అర్దర్కులు నాయాలే కాదు ,
శానా తక్కువ నా కొడుకుని ... ఇట్లు ఈ కత రాసినోడు.
"యట్లెట్లా ఇంగో కీత సెపు సామీ ఆ సుద్ది " వక్కాకు నమలతా అనే మా అవ్వ .
"మోవ్ ! ఎన్ని కితాలు ఎట్లెట్ల సెప్పినా అదంతే. 
శంబూకుడు తప్పుసేసే తబుసు సేసి. శీరాముడు వాని తలా నరికె" కోపముగా అనిరి సాములోళ్లు. 
"ఇంత బిర్న కోపము సేసుకొంటే ఎట్ల సామీ! 
మేము ఎన్ని యుగాలనింకా కోపము సేసుకోకుండా ఉండాము.
నిదానము .నిదానము సామీ " సున్నము నోట్లా యేసుకొని మాట్లాడే అవ్వ
( యట్లెట్లా! నుంచి)


రచయిత వైద్యుడు కదా.ఆయన వృత్తి నైపుణ్యాన్ని కూడా ఈ కతల్లో నింపిరి. 
కొన్ని తావుల్లో చేదు మందులు మింగిస్తారు. కొన్ని తావుల్లో చురుక్కుమని సూదితో పొడుస్తారు. 
కొన్ని తావుల్లో  మలాము పూసి మెత్తని  కట్టు  కడుతారు. 
పత్రికల తెలుగులో లేదు కదా అని  ఈ కతలను పక్కకు పెట్టంద్దండీ. పత్రికల తెలుగు అద్దాల అరల్లోని అందాల బొమ్మ అయితే, తావు తెలుగు చెమటను చిందించి సాకే అమ్మ.
 "మా తావు తెలుగు కాదు కదా " అని ముఖం చిట్లించకండి. 
తెలుగు తల్లి కనిన గారాబు బిడ్డ మా హోసూరు తెలుగు. 
మా తెలుగు తావి మిమ్మల్ని కమ్ముకొని జోకొడుతుంది.
 నిజమైన మాట ఇది. నమ్మకం లేక పోతే మొదలు పెట్టి చూడండి. 
నంద్యాల నారాయణ రెడ్డి (+91 9360514800)
***
నా తావుకి వచ్చే రోగులకి మందులిచ్చి పంపేయకుండా ,
బిడువు చేసుకొని రవంచ పొద్దు వాళ్ళతో మాట్లాడతా ఉంటాను. 
అంతకు ముందర ఎపుడూ విని ఉండని మాటలు వస్తే,
వాటిని జోపానముగా రాసి పెట్టుకొనేది అలవాటయ్యింది. 
ఇట్లా మాటలని మూటకట్టుకొంటా ఉండిన నాతో ,
" ఇంకొక కతల పుస్తకం తేవాలని" రమేశప్ప చెప్పిరి. 

ఇట్లా రాస్తా రాస్తా హోసూరు మాండలికమనే విమానమెక్కి, 
ఆంధ్రా అసెంబ్లీ లో దూరి,దేశమంతా పారాడి, మంచీ చెడ్డలు చూసి,
 భూమమ్మ కూతురికీ పొద్దప్పకొడుకీ పెండ్లి చేసి  మబ్బు దేవునికి మొక్కి వస్తిని.
డా. అగరం వసంత్ 


54  కతలు 
వెల :  రూ.100/- 

చేపలుకి :
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
స వెం రమేశ్ :  (0) 8500548142   
ఉమా మహేశ్వరరావు 8985425888

***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, May 26, 2014

మోతుకుపూల వాన

మోతుకుపూలంటే ..?!?
దారంతా ఉవ్వెత్తున లేచిన మంటలా ఎర్రగా విరబూసిఉన్నాయి...అవేనా?
ఊహూ ..కాదు. అవి అగ్ని పూలు.
సభాప్రాంగణం వాకిట్లో తమ రేకులతో ఎర్రతివాచీ పరిచాయి... అవేనా ?
కానే కాదు. అవి తురాయి పూలు.
మరి మోతుకుపూలంటే ఏందబ్బా.. త్వరగా చెప్పూ..
మా బతుకులు !


పూలచినుకులు ..
పంతొమ్మిది రచయితల కథలు.
వెల -80/-
ప్రచురణ: కృష్ణగిరి రచయితల సంఘం,హోసూరు
ప్రతులకు : 

కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 
2-1095, ఆవులపల్లి రోడ్,బస్తి,హోసూరు-635109,
కృష్ణగిరి జిల్లా,తమిళనాడు.

చేపలుకి :
స వెం రమేశ్ :  (0) 8500548142   
ఉమా మహేశ్వరరావు 8985425888
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, May 24, 2014

సొంపూ సోయగం


నిండా పంతొమ్మిదేళ్ళు రాని వయసులో రాయడం మొదలెట్టి ,
ఈ కొద్దికాలంలోనే తన రాతలను ఒక పుస్తకరూపంలో అందుకొంటున్న ఆ క్షణాన 
సుమను చూస్తే ఎంత ముచ్చటేసిందో ! 

ఆ పూట కార్యక్రమాన్ని తన స్నేహితురాలితో పాటు ,
తెలుగుతల్లికి మల్లెపూదండ వేసి ప్రారంభించినా, 
వేదిక మీద కు రావడానికి బిడియ పడుతూ సిగ్గు పడుతూ ,
పాటలొలికిన ఆ నోటిలో మాటలు కరువయినట్లు, 
ఆర్తిగా మప్పిదాలు పలికి
గబుక్కున వెళ్ళి తన కుర్చీలో కూచున్న వైనం ,  
మన తెలుగు కతకు వేసిన సరికొత్త చిగురు పసిడి మొగ్గ లా తోచింది.
 సుమకు అనేకానేక శుభాకాంక్షలు. 
తనలానే అనేక సుమాలు మోసులెత్తి 
తెలుగుకతమ్మవడి నింపాలని కోరుకుందాము.
***

దేవిశెట్టి పల్లి మాలగేరిలో ఒక పేద ఆలూమగలైన రామక్కకెంచప్పలకు పుట్టిన మా మునిరాజన్న కతలు రాసేది మొదులు పెట్టినంక ,ఆయనకనే ఒక మరియాదను నలుగుర్లో సంపాదించుకొన్నాడు.
అదంతా చూస్తా ఉంటే నాకు కూడా ఏదన్నా రాయాలనిపిచింది. 
ఏమి రాయాల అని యోచనలో ఉంటే ,
మా మునిరాజన్న ఒక నాడు నాతో ,
" మన ఇండ్లల్లో చేసునే వంటల్ని రాయుమని చెప్పిండాడు రమేశయ్య ,
రాస్తావా బిడ్డా " అన్నాడు .
నేను ఎగిరి గంతేసి సరే అంటిని ,కాగితమూ కలమూ తీసుకొని మొదులు పెడితిని. 
బిరబిర ఒబ్బట్ల వంటకము గురించి రాసి మా అన్న చేతిలో పెడితిని. 
నేను రాసిండే దానిని చదవతా పడి పడీ నగుతా ఉండాడుమునిగాడు. నాకు రేగిపోయింది. 
"ఏమయింది నా రాతలకి ఏల అట్లా  నగేది,చెప్పి చావు " అని అరిస్తిని. 
అపుడు చెప్పినాడు మా అన్న ," తిక్కల బిడ్డా,మా టీవి లో వచ్చే మా వూరి వంట చూసేసి 
అదే మాదిరిగా రాసేస్తే ఎట్ల?"
నిజం చెప్పాలంటే నాకు వంట చేసేది అంత బాగా రాదు.
మా అమ్మా పిన్నమ్మా ఒదినలే మాఇంట్లో వంటచేసేది.అందుకే
ఈ కతల్లో వంట తక్కువ .మా అమ్మ బతుకే ఎక్కువ. 
ఈ కతల్లో చానా వంటలకు కొలతలు చెప్పలేదు నేను.
కొలిచిచేసే వంటలు ఎట్లుంటాయో మీకూ తెలుసు . నాకూ తెలుసు.


నా పేరు ముందు ఉందే రామక్క ,ఆమే నన్ను కన్నతల్లి. 
అబ్బ పేరునే మా పేరుకు ముందు పెట్టుకుంటాము. 
నేను మా అమ్మ పేరు పెట్టుకొంటిని.
ఏలంటే అమ్మ లేక పొతే నేను లేను. నా పుటక లేదు. 
నా చదువు లేదు. ఈ కతలు లేవు. మీతో చెప్పుకొనేకి ఇన్ని మాటలు లేవు. 
అందుకనే ,మీ అట్లా పెద్దోళ్ళతో మాట్లాడే తెంపు కోసరమే పేరులో కూడా అమ్మను తోడు తెచ్చుకొంటిని.
ఇంతకీ  మా వంటలు బాగుండాయో లేదో చెప్పనే లేదే మీరు !
రామక్క గారి సుమ

ముఖ చిత్రం : " పత్రచిత్రకారిణి " డా.లక్ష్మీ సుహాసిని 
తన పుస్తకాన్ని కొని చదవడమే సుమకు మనమిచ్చే ప్రోత్సాహం !
సుమ పుస్తకం ప్రతులకు:
కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 
2-1095, ఆవులపల్లి రోడ్,బస్తి,హోసూరు-635109,
కృష్ణగిరి జిల్లా,తమిళనాడు.

చేపలుకి :
స వెం రమేశ్ :  (0) 8500548142   
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
సుమ  (0) 9715420303 
ఉమా మహేశ్వరరావు 8985425888

***
ప్రభవ (0861)2333767/2337573
prabhava.bppks@gmail.com
Related Link : More Photos :http://chandralata.blogspot.in/2014/05/blog-post_24.html

Thursday, August 4, 2011

వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు — చంద్రలత

(http://pustakam.net/?p=7834)

JAMPALA CHOWDARY 29 JULY 2011 161 VIEWS వ్యాఖ్యల్లేవు
జూన్ నెల చతుర ముఖపత్రం చూస్తే కొద్దిగా ఆశ్చర్యం వేసింది. సారి నవల చంద్రలతగారి వాళ్ళువీళ్ళుపారిజాతాలు

చంద్రలతగారి మొదటి నవల, వర్ధని, చతురలోనే (1996లో) ప్రచురింపబడినా, తరువాత ఆమె వ్రాసిన రెండు నవలలు - రేగడి విత్తులు(1997), దృశ్యాదృశ్యం (2003) – విస్తృతిలో చతుర పరిమితుల్ని అధిగమించినవి. మళ్ళీ చతుర పరిధిలో ఆమె ఇంకో నవల వ్రాయగలగటం ఆశ్చర్యమే.
వాళ్ళువీళ్ళుపారిజాతాలు ఇద్దరునీలు కథ. కాదు కాదు, ఎంతో మంది నీలుల కథ. వాళ్ళు -, వీళ్ళు -, పారిజాతాలు అని మూడు ప్రకరణాలు.
 మొదటి రెండు భాగాల్లోనూ నీలు అనే అమాయకపు ఆడపిల్ల -పారిజాతం చెట్టు చుట్టూ రాలిన పూలని ఏరుకొని మాలలు కట్టి అలంకరించి ఆడుకుంటూ ఆనందించే అమాయకపు ఆడపిల్ల() – కథ.
 ఇద్దరు నీలుల కథలూ ఒక్కలా మొదలై ఒక్కలానే ముగుస్తాయి. కానీ ఒకరు పుట్టిపెరిగింది తూర్పుతీరంలో, ఇంకొకరు పశ్చిమతీరంలో. వారి భాషలు వేరు. వారి మతాలు వేరు. ఒకరు పేదింటి బిడ్డ; ఇంకొకరు పెద్దింటి బిడ్డ. ఐతేనేం, ఇద్దరూ ఆడపిల్లలే
సాంప్రదాయపు ఉక్కు ప్రాకారాల మధ్య, సంప్రదాయ రక్షకుల కనుసన్నల మధ్య జీవించిన వారే. చీకటి కూపాల్లో బంధితులైనప్పుడు వారికి కనబడ్డ మిణుగురు పురుగుల్ని వెలుగురేఖలని భ్రమించి వాటి వెంబడి స్వేఛ్ఛా వాయువుల్ని వెతుక్కొంటూ పరుగెత్తినవారే. అప్పుడు వారికి పూర్తిగా తెలియదు పరుగులు తమను చేర్చే గమ్యస్థానం స్మశానమేనని. రక్తసంబంధానికన్నా దురభిమానానికే శక్తి ఎక్కువన్న సత్యం వారికి అర్థం కాలేదు. రెండు రాలిన పారిజాతపు పువ్వులు పరువు హత్యలు అని చెప్పబడుతున్న ఆభిజాత్యపు కిరాతకాల బాధితులకు ప్రతీకలు. హత్యల విషాద పర్యవసానాల గురించి మూడో భాగంలో పారిజాతాలు చెబుతాయి.
కథలు ఇలాగే ఉండటానికి వెనుకాల చాలా శక్తులే ఉన్నాయి. సంప్రదాయం, దురభిమానం, వెనుకబాటుతనం, అసహనం, మౌఢ్యం, భయం. వీటన్నిటినీ ఒకోసారి సూటిగా, ఒకోసారి సూచ్యంగా రచయిత్రి ప్రస్తావిస్తారు. హత్యల్లో చచ్చిపోయేది ఒక్క స్త్రీయే అనుకుంటే పొరపాటని, హత్యల పర్యవసానాలు తరతరాల్లో ప్రతిఫలిస్తాయని విశదంగా తెలియపరుస్తారు.
కథ చెప్పటానికి రచయిత్రి ఎన్నుకొన్న ప్రక్రియ బాగుంది. రెండు కథల స్థలాల్లోనూ, పాత్రల్లోనూ చాలా వైవిధ్యం ఉన్నట్లు కనిపించినా, ఆంతకు మించిన సారూపత ఉందన్న విషయాన్ని చెప్పకుండానే నిరూపించారు. కుంచించుకుపోతున్న మొదటి నీలు జీవిత వాతావరణాన్ని, విశాలమౌతున్న రెండో నీలు ప్రపంచాన్ని చక్కగా చిత్రీకరించారు.
మొదట్లో కొంచెం చిక్కుగా అనిపించినా కథ కొంత ముందుకు వెళ్ళాక సాఫీగా సాగుతుంది. మధ్య మధ్యలో రచయిత్రికి అభిమానమైన, అవసరమనిపించిన విషయాల మీద చిన్న చిన్న ఉపన్యాసాలు (మిగతా పుస్తకాలలో లాగానే) ఉన్నా, వాటిని కూడా విసుగు అనిపించకుండా ఇమడ్చటం ఈవిడకు  తెలుసు.
ఐతే పరువు హత్యలు వాళ్ళకు, వీళ్ళకు సంబంధాలు ఏర్పడినప్పుడు జరిగే మాట నిజమే అయినా, వాళ్ళకూ వీళ్ళకూ మధ్య తేడా మతపరమే అవనక్కరలేదు. ఆభిజాత్యం, దురభిమానం వల్ల రకంగా మనుషులు తమని విభజించుకున్నా ఇలాటి సంఘటనలు జరిగే అవకాశం పెరుగుతుంది. ఏనాడో కల్యాణ సుందరీ జగనాధ్ గారి కథ అలరాస పుట్టిళ్ళలో  మనం సంఘటన చూడలేదా? చతురలో ప్రత్యేక వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణలు చూసినా ఇది తెలుస్తుంది. ( ప్రత్యేక వ్యాసం రాసినవారి పేరు ఇవ్వలేదు).
లాస్ ఏంజెల్స్లో పదకొండవ తానా సమావేశాల (1997) సందర్భంగా సీయెస్సీ మురళి గారు నిర్వహించిన మొదటి తానా నవలల పోటీలో లక్షా ఇరవైవేల రూపాయల బహుమతికి చంద్రలతగారి రేగడి విత్తులు నవలను ఎంపిక చేసిన బృందంలో నేనూ ఒకణ్ణి. తెలుగులో వచ్చిన మంచి నవలల జాబితాలో తప్పకుండా ఉండే పుస్తకాలలో రేగడి విత్తులు ఒకటి అని ఇప్పటికీ నా అభిప్రాయం. బహుమతి ప్రకటించాక, నవల రాసింది ఒక యువరచయిత్రి అని తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాను. అప్పటికే ఆమె నేనూ నాన్ననవుతా కథకు విపుల పోటీలో బహుమతి గెలుచుకొన్నారు; ఒక నవల, చాలా కథలు ప్రచురింపబడ్డాయి. తరువాత పద్నాలుగేళ్ళలో చంద్రలత హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా పని చేస్తూ, హేతువాద, పర్యావరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా, మరిన్ని మంచి కథలు, దృశ్యాదృశ్యం వంటి మంచి నవల వ్రాశారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రెండు పుస్తకాలు (చేప లెగరా వచ్చు, వచ్చే దారెటు) ప్రచురించారు. మడతపేజీ అన్న బ్లాగును నిర్వహిస్తున్నారు. పిల్లలలో సాహిత్యాభిలాషని పెంపొందించడానికి రకరకాలుగా కృషి చేస్తుంటారు. పుస్తకంలోనూ కొన్ని వ్యాసాలు వ్రాశారు. తానా బహుమతిని స్వీకరించడానికి లాస్ఏంజెల్స్ వచ్చినప్పటినుండీ, చంద్రలతగారు మాకు మంచి కుటుంబమిత్రులయ్యారు. వివిధ విషయాలపై ఆవిడకి ఉన్న ఆసక్తి, విశ్లేషణా శక్తి, గాఢాబిప్రాయాలు నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాను రాసే విషయాల గురించి శ్రద్ధగా అధ్యయనం చేయడం, నిశితంగా పరిశీలించడం, వాతావరణాన్నీ, సంఘటనలనీ, మనస్తత్వాలనీ సహజంగా చిత్రించడం చంద్రలత గారి బలం.
చతుర సైజులో, బోలెడు బొమ్మలు, ప్రకటనలు, ఛలోక్తులు, పెట్టె కథలు, పొట్టి కవితలు కలుపగా 86 పేజీలు నిడివి ఉన్న కథనాన్ని నవలగా కాకుండా పెద్ద కథగా వర్గీకరించ వచ్చేమో. కథల వస్తువు పాతదే అయినా, వస్తువు పరిచయం, విశ్లేషణ ఆసక్తికరంగా ఉన్నాయి.
వాళ్ళువీళ్ళుపారిజాతాలు
జూన్ 2011
చతుర
వసుంధర పబ్లికేషన్స్,
ఈనాడు కాంపౌండ్, సోమాజిగూడ, హైదరాబాద్ 500 082
పుస్తకం ఎలక్ట్రానిక్ కాపీని ఇక్కడ చదువవచ్చు.

********************
చికాగో మెడికల్ స్కూల్లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్..), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
(పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో )

Prabhava,Books and Beyond ! * All rights reserved.